narthanasala movie actress yamini bhaskar telugu girl becomes telugu actress _ narthanasala actor naga shourya

‘తెలుగమ్మాయిలకి అవకాశాలు ఇవ్వరని నేను చెప్పను. ప్రతి శుక్రవారం పది మంది కొత్త కథానాయికలు వస్తుంటారు. దాంతో పోటీ పెరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ ఎవరి ఆధిపత్యమూ ఉండదు’’ అంటున్నారు యామినీ భాస్కర్‌. విజయవాడ నుంచి వచ్చిన అచ్చ తెలుగమ్మాయి యామిని. ‘కీచక’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘నర్తనశాల’లో నాగశౌర్య సరసన నటించింది. ఈ సందర్భంగా యామినీ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘చిత్ర పరిశ్రమలో కథానాయికలకి అందంతో పాటు, ప్రతిభ కీలకం. అన్ని రకాల పాత్రలకీ సరిపడేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం ముఖ్యం. జీవితం నేర్పిస్తుందంటారు కదా. అలా ఈ మూడేళ్ల అనుభవంలో చాలా నేర్చుకొన్నా. నటన పరంగా, లుక్‌ పరంగా కూడా నాలో నేను చాలా మార్పులు చూసుకొన్నా. నా ఆలోచనల్లోనూ మార్పులొచ్చాయి. ‘నర్తనశాల’తో నా కెరీర్‌ మారిపోతుందని నమ్ముతున్నా’’.
* ‘‘ఒక తెలుగమ్మాయిగా నా సినీ ప్రయాణం ఇష్టంగా, అప్పుడప్పుడు కాస్త కష్టంగా అనిపిస్తూ ముందుకు సాగుతోంది. ఇక్కడ అదృష్టం కూడా కీలకమే. టైమ్‌ రావాలంటుంటారు కదా. ఆ మాటని బాగా నమ్ముతా. ఈ సినిమా విషయంలో టైమే కలిసొచ్చింది. చిత్రీకరణకి వారం రోజుల ముందే నేను ఈ సినిమాకి ఎంపికయ్యా. తెలుగమ్మాయిని కావడం కూడా నా ఎంపికకి ఓ కారణం. నాగశౌర్యతో కలిసి నటించడం మంచి అనుభవం. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉన్నా... రెండూ భిన్నమైన పాత్రలు. నేను సత్యభామ అనే ఓ గడుసైన అమ్మాయిగా కనిపిస్తా. చాలా ధైర్యమున్న అమ్మాయి సత్య. పాత్ర రీత్యా నేను ఫైట్లు కూడా చేశాను. స్వతహాగా చిన్నప్పట్నుంచి దృఢమైన అమ్మాయిని. చిత్రీకరణకి ముందు చిన్నపాటి శిక్షణ తీసుకొని ఆ సన్నివేశాల్లో నటించా. ఎంతైనా అమ్మాయిలం కదా, సున్నితంగానే ఉంటాం. అందుకే ఫైట్లు చేశాక చేతులు కందిపోయేవి’’.

* ‘‘మంచి సినిమాలు చేయాలనే తపన ఉంది. బాగున్నాను, బాగా నటిస్తున్నాను కదా అనిపిస్తోంది. కథానాయకుడిలా సినిమా మొత్తం కనిపించాలనే ఓ కోరిక ఉంటుంది లోపల. మొన్ననే ‘నరసింహ’ సినిమాని టీవీలో చూస్తున్నప్పుడు రమ్యకృష్ణ తరహా పాత్రలు రాయొచ్చు కదా, అలాంటి పాత్ర నాకొస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇటీవలే దర్శకుడు మారుతి నిర్మాణ సంస్థలో ‘భలే చౌక బేరమ్‌’ అనే చిత్రం చేశా. అది సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకొస్తుంది. మధ్యలో ఓ తమిళ సినిమా చేశా. అనుకోకుండా ‘నర్తనశాల’లో నటించే అవకాశం వచ్చింది. ఇదే నా తొలి సినిమా అయ్యుంటే ఎంత బాగుండేదో. కంగారుపడి, సరైన అవగాహన లేకుండా మూడేళ్లు ముందే వచ్చేశానేమో అనిపిస్తోంది (నవ్వుతూ)’’.

* ‘‘నేను పుట్టి పెరిగింది, చదువుకొన్నది విజయవాడలోనే. స్కూల్‌, డ్యాన్స్‌ పాఠాలు తప్ప మరో విషయం తెలియదు. ‘నువ్వు బాగుంటావు, హీరోయిన్‌గా ప్రయత్నించొచ్చు’ అనేవాళ్లు. పదో తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్‌ ప్రిన్సిపల్‌ కూడా అదే చెప్పారు. దాంతో సినిమాలపై దృష్టి మళ్లింది. అలా మా ప్రిన్సిపల్‌ నా చదువంతా చెడగొట్టారు (నవ్వుతూ). బీఎస్సీ పూర్తయ్యాక హైదరాబాద్‌ వచ్చి దేవదాస్‌గారి దగ్గర యేడాదిపాటు నటనలో శిక్షణ తీసుకొన్నా. నా ఆసక్తితో పాటు, మా అమ్మ కూడా నన్ను ప్రోత్సహించారు. విజయవాడలో నాది చిన్న ప్రపంచం. కథానాయికగా ఇప్పుడీ ప్రయాణం గుర్తొస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఏదైనా మనల్నిబట్టే ఉంటుంది. ఇక్కడ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉన్నది నిజమే. అలాంటి ప్రలోభాలతో నన్నూ కొంతమంది సంప్రదించారు. అలాంటి తప్పు దారిలో వెళ్లలేదు. మనం దృఢంగా ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఏమీ అనరు’’
































































































































































































































Comments

Popular posts from this blog

alekhya actress celebrity #kondapalli #naidu #kgf #alekya

‘యన్‌.టి.ఆర్‌ సినిమా NTR kathanayakudu movie balakrishna,hansika,rakul,payal,vidya kalyan ram,sumanth,rana...